హుజూరాబాద్‌ ఉపఎన్నిక : పోరు పార్టీల మధ్యే… మద్యం విషయంలో కాదు

కరీంనగర్‌ : ఏ ఎండకు ఆ గొడుగు చందంగా రాజకీయ నాయకులు పార్టీల గోడలు దూకడం తెలిసిందే. ప్రస్తుత హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ఆయా పార్టీలు ఓ అడుగు ముందుకేసి, జనాలనూ మార్చేస్తున్నాయి. అభ్యర్థుల ముందు ఆ సమయానికి కండువా కప్పుకుంటే చాలంటున్నారు నేతలు.

ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ ఆ జనసమూహాన్ని తమ సైన్యంగా చూపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సామాన్యులకూ లాభదాయకంగా మారింది.

ఆ రోజుకు బీరు, బిర్యానీతోపాటు రూ.500 ఇస్తున్నారు. తమ అధినేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు గల్లీ నాయకులు పక్క వీధిలోని అపరిచితుల్నీ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిస్తున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకరిచేత కండువా కప్పించుకున్న గల్లీ కార్యకర్తలు మరుసటిరోజు మరో పార్టీ కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్‌ అని బేరాలాడుతున్నారు. ఇదో ఎన్నికల చిత్రం!