పెద్దపల్లి : హైకోర్టు న్యాయ వాది వామన్‌రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్‌రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం.
దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి చెప్పారు.