గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి లాయర్‌ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్‌

Facebook
Twitter
Telegram
WhatsApp

• వామన్‌రావు దంపతుల హత్య కేసులో హైకోర్టుకు నివేదించిన ఏజీ

• ఏడుగురు నిందితులు, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు

• ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చేందుకు 4 వారాలు పట్టొచ్చని వెల్లడి

• దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు

పెద్దపల్లి : న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్‌) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదిక సమర్పిం చారు.

ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్‌ మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

నివేదికపై హైకోర్టు సంతృప్తి
దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.