పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్!

Facebook
Twitter
Telegram
WhatsApp
పెద్దపల్లి : గత కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయనను రామగుండం టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రామగుండం తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు ‘గాయబ్‌’ అయ్యారు.ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండగా, పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారని వార్తలు వినిపించగా, తాజాగా భీమవరంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. వారం రోజులుగా అదృశ్యమవడానికి గల కారణాల గురించి మధును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే మధుపై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.

వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. కాగా పెద్దపల్లికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.