హైకోర్టు న్యాయవాదుల జంటహత్య కేసులో : బిట్టు శ్రీను అరెస్టు

0
582
Facebook
Twitter
Telegram
WhatsApp

ఇప్పటి వరకు నలుగురు అరెస్టు

పెద్దపల్లి : తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్‌ వెల్లడించారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జడ్పీ ఛైర్మర్‌ పుట్ట మధు మేనల్లుడు. న్యాయవాదుల హత్యకు సంబంధించి వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లు బిట్టు శ్రీను మీద అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతోపాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్‌ సమకూర్చాడని పోలీసులు నిర్ధరించారు. దీంతో అతడ్ని శుక్రవారం అరెస్టు చేశారు. అతడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతల్ని ఇతడే చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినది కావడం గమనార్హం. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని తెలుస్తోంది. బిట్టు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీనును అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. జంటహత్యల కేసులో ఇప్పటికే గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌లతో పాటు విలోచవరం గ్రామానికి చెందిన శివందుల చిరంజీవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను ఇవాళ మంథని కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.