ప్రేమే ప్రాణమనుకున్న రజితకు.. ప్రేవిుంచిన భర్త వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేయడంతో నాలుగునెలల చిట్టితల్లిని వదిలి చితిపైకి…
కరీంనగర్ / శంకరపట్నం : ప్రేమే ప్రాణమనుకున్న రజితకు.. ప్రేవిుంచిన భర్త వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేయడంతో నాలుగునెలల చిట్టితల్లిని వదిలి చితిపైకి వెళ్లింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా.. శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజితకు పుట్టినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన రెండు, మూడురోజులకే తల్లి స్వరూప కన్నుమూసింది. తండ్రి నర్సయ్య ఊళ్లో పశువుల కాపరీగా పనిచేసి కూతురు ఆలనాపాలన చూసేవాడు. కొన్నేళ్లకు రజిత తండ్రి నర్సయ్య పద్మను రెండో వివాహం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో గద్దపాక వాగులోని బావిలో ప్రమాదవశాత్తు పడి రజిత తండ్రి నర్సయ్య పదేళ్లక్రితం మృతిచెందాడు. పినతల్లి పద్మ రజితను ఉన్నత చదువులు చదివించింది.
రజిత పెళ్లినాటి ఫోటో
ఈ క్రమంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న చోట మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. నాలుగుమాసాలక్రితం రజిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొన్నినెలలుగా రజిత అనారోగ్యానికి గురికాగా వారంక్రితం భూతవైద్యుడు దొగ్గల శ్యామ్‌ను తీసుకువచ్చారు. భూతవైద్యం పేరుతో రజితకు దయ్యం పట్టిందని తలవెంట్రుకలు పట్టుకుని విచక్షణరహితంగా కొడుతూ మంచంపై పడేయడంతో తలకు గాయమైంది. ఐదురోజులక్రితం కరీంనగర్ ప్రైవేట్ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్సచేస్తుండగా సోమవారం అర్థరాత్రి మృతిచెందింది.
గద్దపాకలో అంత్యక్రియలు
మంచిర్యాల జిల్లా కుందారంలో భూతవైద్యానికి బలైన రజిత అంత్యక్రియలు శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో పుట్టిన ఊరిలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యంతో రజిత ప్రాణాలు బలిగొన్న అత్తింటివారితోపాటు భూతవైద్యుడికి సహకరించిన బాబాయ్ రవీందర్‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, రజిత మృతదేహానికి సివిల్‌ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని గద్దపాకకు తీసుకురాగా హత్యానేరంతో అత్తింటి వారు రాకపోవడంతో పినతల్లి, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యుడి చేతిలో ప్రాణాలు వదిలిన రజిత అంత్యక్రియల్లో మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. నాలుగునెలల చిన్నారి అనాథగా మారిందని పలువురు కంటతడిపెట్టారు.